విడుదల తేదీ : 16 నవంబర్ 2013 TeluguWorld.wap.sh : 3.0/5 దర్శకుడు : దిపన్ చక్రవర్తి నిర్మాత : గుడ్ సినిమా గ్రూప్ సంగీతం : సంతోష్ నారాయణ్ నటీనటులు : ఆశోక్ సెల్వన్, సంచిత శెట్టి, నాజర్సీ..
తమిళంలోనే కాక తెలుగులో కుడా మంచి విజయం సాధించిన సినిమా ‘పిజ్జా’. ఇప్పుడు ఇదే సినిమా నేపధ్యంలో ‘విల్లా(పిజ్జా 2)’ అనే టైటిల్ తో ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదలయ్యింది. తెలుగు హక్కులను గుడ్ సినిమాస్ గ్రూప్ సొంతం చేసుకుంది. దీపన్ దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ :
స్వతహాగా రచయిత అయిన జేబిన్ (అశోక్ సెల్వన్) తన మొదటి నవల విడుదలకోసం ఎదురుచూస్తూ వుంటాడు. కాకపోతే అతనికి తన తండ్రి(నాజర్)తో మంచి సంబంధం వుండదు. నాజర్ చనిపోయాక తనకు ఉన్నదంతా అమ్ముకుని అప్పులలో పడతాడు జేబిన్.
కాకపోతే అనుకోకుండా తనకు భీమిలిలో ఒక అందమైన విల్లా వుందని అక్కడకు వెళ్తాడు. అక్కడకు వెళ్ళిన వెంటనే తనకు అన్నీ మంచి పరిణామాలు ఎదురవుతాయి. అందుకని ఆ విల్లాను అమ్ముకునే ఉద్దేశం ఆపుకుని అక్కడే తన గర్ల్ ఫ్రెండ్ ఆర్తి(సంచిత శెట్టి)తో కలిసి వుంటాడు
కాకపోతే ఒక మూల వున్నా గదిలో విచిత్రమైన పెయింటింగ్స్ ను చూడడంతో అనూహ్యమైన సంఘటనలు ఏర్పడతాయి. ఆ భవనంతో అల్లుకున్న చాలా మంది జీవితాలు వెలుగులోకి వస్తాయి.
ఆ పెయింటింగ్ లో ఉన్నది ఏమిటి? వాటి వల్ల ఎంతటి నష్టాలు జరిగాయి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానమే ‘విల్లా(పిజ్జా 2)’ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కుంటూ బతుకుతున్న వ్యక్తిగా అశోక్ సెల్వన్ మంచి పెర్ఫార్మెన్స్ ఏ ఇచ్చాడు. సంచిత శెట్టి పర్వాలేదు. నాజర్ ది చిన్న పాత్ర అయినా ముఖ్యమైన పాత్ర పోషించారు.
ఈ సినిమా కధ కొంచం కొత్తగా వుంది. ఇటువంటి కధతో భయాన్ని అంత రియల్ గా చూపించడం అంటే గొప్ప విషయమే. కొన్ని సన్నివేశాలలో ఎంత గుండె నిబ్బరమున్న ప్రేక్షకుని చేతనైనా భయపెట్టించగల రీతిలో తీయడం మెచ్చుకోదగినది.
ఇంటర్వెల్ ఎపిసోడ్ ను బాగా చిత్రీకరించారు. ఈ సినిమా బడ్జెట్ లో అందించిన వి.ఎస్.ఎక్స్ చాలా బాగున్నాయని చెప్పాలి. కెమెరా యాంగిల్స్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ ను బాగా వాడుకున్నారు
మైనస్ పాయింట్స్ :
‘పిజ్జా 2′ అనగానే ‘పిజ్జా’ సినిమాతో తప్పకుండా పోల్చుకుంటాం. కానీ ఈ సినిమాకు ‘పిజ్జా’ సినిమాలో వున్నంత హర్రర్ అయితే లేదు. సినిమా నిడివి చిన్నదే అయినా కొన్ని కొన్ని సీన్ లలో బోర్ కొడుతుంది. ముఖ్యంగా ప్రధమార్ధంలో మెయిన్ ప్లాట్ లోకి కధను తీసుకురావడానికి చాలా సమయం వృధాచేసారు. నాజర్ తప్ప ఇంకెవరవీ తెలిసిన మొహాలు లేవు. ఎంటర్టైన్మెంట్ ను ఇష్టపడే వారూ, భీభత్సమైన హర్రర్ ను ఆశించేవారూ ఈ సినిమాను చూసి నిరాశపడతారు.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సౌండ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయానికి దోహదపడుతుంది. ఎడిటింగ్ పర్వాలేదు.
దర్శకునిగా దీపన్ మంచి పేరే తెచ్చుకున్నాడు. కధను అందంగా తెరకెక్కించాడు, ప్రధమార్ధంపై మరింత దృష్టిపెడితే బాగుండేది.
తీర్పు :
‘విల్లా(పిజ్జా 2)’ ఒక మంచి థ్రిల్లర్. దీనికీ ‘పిజ్జా’ సినిమాకూ ఎటువంటి సంబంధంలేదు. ఆ సినిమా పంచినంత ఎంటర్టైన్మెంట్, హర్రర్ ను మాత్రం ఆశించవద్దు.